సైకోసిస్
Psychosis
Below is a Telugu translation of our information resource on psychosis. You can also view our other Telugu translations.
హక్కు నిరాకరణ
దీన్ని చదవడానికి ముందు, దయచేసి మా నిరాకరణను సమీక్షించండి.
సైకోసిస్ (మానసిక భ్రాంతి) అనేది ఒక వ్యక్తి ఆలోచనలు మరియు భావాలు చాలా తీవ్రముగా/గణనీయం గా మారిపోవుట వల్ల, వారు తమ లక్షణాలను నిజ జీవితం తో వేరు చేయలేరు. ఈ విషయం విభాగము, సైకోసిస్ గురించి పరిశీలిస్తుంది. సైకోసిస్ అంటే ఏమిటి, అది ఎందుకు జరుగుతుంది, దానికి ఎలా చికిత్స చేస్తారు, అలాగే అది ఇతర మానసిక మరియు శారీరక వ్యాధులు తో ఎలా సంబంధం కలిగి ఉంటుందో వివరిస్తుంది.
సైకోసిస్ అంటే ఏమిటి?
సైకోసిస్ (మానసిక భ్రాంతి) అనేది కొన్ని లక్షణాల సమూహం అని చెప్పడానికి వాడే పదం. ఒక వ్యక్తి సైకోసిస్‌ను అనుభవిస్తున్నప్పుడు, వారి ఆలోచనలు, భావాలు ఎంతగా మారిపోతాయంటే, ఏది నిజమో ఏది కాదో గుర్తించడం వారికి కష్టంగా ఉంటుంది.
సైకోసిస్ చాలా మంది అనుకునే దానికంటే ఎక్కువగా కనిపిస్తుంది, మరియు దీనిని అనుభవిస్తున్న వ్యక్తికి ఇది చాలా భయంకరంగా ఉండవచ్చు అలాగే వారి చుట్టూ ఉన్నవారికి కూడా బాధాకరంగా ఉంటుంది. అయితే సైకోసిస్‌తో బాధపడుతున్న వారికి సహాయం మరియు మద్దతు అందుబాటులో ఉన్నాయి.
సైకోసిస్ యొక్క లక్షణాలు ఏమిటి?
భ్రమలు
భ్రమలు అనేవి మీకు చాలా నిజమనిపించే నమ్మకాలు. అయితే, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల వంటి ఇతర వ్యక్తులు బహుశా వాటిని పంచుకోలేరు లేదా అవి వారికి అర్థం కాకపోవచ్చు. ఈ భ్రమలలో ఈ క్రింది విషయాలు ఉండవచ్చు:
- మీరు వాస్తవానికి ఉన్నదానికంటే చాలా శక్తివంతులు, ముఖ్యమైనవారు, ధనవంతులు లేదా ప్రసిద్ధులు అని బలంగా నమ్మడం. ఉదాహరణకు, మీరు రాజకుటుంబ సభ్యులని భావించడం/నమ్మడం.
- అలాగే, కొన్ని విషయాలు మీ జీవితంతో ప్రత్యేకంగా సంబంధం ఉన్నట్టు కూడా అనిపించవచ్చు. ఉదాహరణకు, టీవీ లేదా రేడియోలోని వ్యక్తులు మీతో సంభాషిస్తున్నారని లేదా కేవలం మీ కోసమే ఉద్దేశించిన సందేశాలను మీకు పంపుతున్నారని.
- మిమ్మల్ని గమనిస్తున్నారని, మీకు హాని జరుగుతోందని లేదా ప్రజలు మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని మీరు భావించవచ్చు. ఉదాహరణకు, ప్రభుత్వం మీ ఫోన్ కాల్స్‌ను వింటోందని మీరు అనుకోవచ్చు.
మీరు ఈ నమ్మకాల గురించి ఇతరులతో మాట్లాడవచ్చు లేదా వ్యక్తపరచవచ్చు. లేదా, మిమ్మల్ని బాధిస్తున్నారని మీరు భావించే వ్యక్తుల నుండి దాక్కోవడం వంటి, ఈ నమ్మకాలకు సంబంధించిన పనులు మీరు చేయవచ్చు.
ఈ నమ్మకాలను మీ మతం లేదా సంస్కృతితో అంత సులభంగా కొట్టిపారేయలేరు.
భ్రాంతులు
భ్రాంతులు అంటే ఇతరులు అనుభవించలేని విషయాలను మీరు అనుభవించడం. అంటే లేని వాటిని వినడం, చూడటం, అనుభూతి చెందడం, వాసన చూడటం లేదా రుచి చూడటం వంటివి.
భ్రాంతులలో అత్యంత సాధారణమైనది శ్రవణ (వినికిడి) భ్రాంతులు. దీనిలో మీరు ఇతరులకు వినిపించని శబ్దాలను, ఒకటి లేదా ఎక్కువ గొంతులు(స్వరాలు) మీకు వినిపించడం. ఈ గొంతులు(స్వరాలు) సాధారణంగా మీ తల లోపల నుండి కాకుండా, మీ వెనుక నుండి లేదా దూరం నుండి ఎవరో మీ చెవిలో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తాయి. కొన్నిసార్లు ఆ గొంతులు(స్వరాలు) నేరుగా మీతో మాట్లాడవచ్చు, లేదా అవి తమలో తాము మీ గురించి మాట్లాడుకోవచ్చు. లేదా రెండూ చేయవచ్చు.
మీ ఆలోచనలు బయటకు పెద్దగా వినిపిస్తున్నట్టుగా అనిపించవచ్చు, అలాగే ఇతరులు వాటిని వినగలరని మీరు నమ్మవచ్చు.
కొన్నిసార్లు మీ భ్రాంతులను 'వివరించడానికి' భ్రమలు సహాయపడతాయి. ఉదాహరణకు, మీ గురించి మాట్లాడుతున్న స్వరాలను మీరు వినగలిగితే, మీ పొరుగువారు మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని, మీరు వింటున్న స్వరాలు అవేనని మీరు భ్రమపడవచ్చు.
శ్రవణ భ్రాంతులు (వినిపించే భ్రాంతులు) ప్రతి వ్యక్తికి వేర్వేరుగా అనిపించవచ్చు. కొంతమంది భయానకంగా, బెదిరించేలా లేదా కలవరపరిచేలా ఉండే గొంతులు (స్వరాలను) వింటారు. ఇంకొంతమందికి వినిపించే గొంతులు సాధారణంగా 'తటస్థమైన' (ఏ భావం లేకుండా) ఉండవచ్చు. మరికొందరికి అయితే అవి ఓదార్పు గా ,లేదా భరోసా గా లేదా ధైర్యం ఇచ్చేలా కూడా అనిపించవచ్చు. కొంతమంది మొదట్లో సాధారణంగా తటస్థమైన లేదా స్నేహపూర్వకమైన స్వరాలను వినడం ప్రారంభిస్తారు, కానీ కాలక్రమేణా అవి మరింత కలతపెట్టేవిగా లేదా ఆందోళన కలిగించేవిగా మారతాయి.
అస్తవ్యస్తమైన ఆలోచనా విధానం
మీరు అస్తవ్యస్తమైన ఆలోచనా విధానాన్ని ఎదుర్కొంటున్నట్లయితే:
- మీ ఆలోచనలు మరియు భావాలు గందరగోళంగా ఉండి, ఒక దానితో ఒకటి సంబంధం లేనట్లు అనిపించవచ్చు లేదా ఒక దానితో ఒకటి సరిగా కలవకపోవచ్చు
- మీరు చెప్పేది ఇతరులకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉండవచ్చు
- కొన్ని సందర్భాల్లో, మీ మాటలు చాలా గందరగోళంగా ఉంటాయి, వాటికి ఏమాత్రం అర్థం ఉండకపోవచ్చు.
తమను ఎవరో ప్రభావితం చేస్తున్నారని లేదా నియంత్రిస్తున్నారని నమ్మడం
మీకు ఈ క్రింది విషయాలపై చాలా బలమైన నమ్మకాలు కలగడం ప్రారంభం కావచ్చు:
- మీ ఆలోచనలు, భావాలు లేదా మీ చర్యలను ఎవరో లేదా ఏదో ఒకటి నియంత్రిస్తున్నట్టుగా అనిపించవచ్చు. ఉదాహరణకు, ఒక మైక్రో చిప్ లేదా శాటిలైట్ ద్వారా నియంత్రిస్తున్నారని అనుకోవచ్చు
- మీ ఆలోచనలు ఎవరో ఒకరిచేత లేదా ఏదో ఒక దానిచేత మీ మనస్సులో ఉంచబడుతున్నాయి లేదా మీ మనస్సు నుండి తొలగించబడుతున్నాయి అని అనిపించవచ్చు
- మీ ఆలోచనలు మీ మనసులో నుంచే బయటకు వెళ్లి, ఇతరులు వాటిని తెలుసుకుంటున్నట్టుగా అనిపించవచ్చు
మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను అనుమానించవచ్చు మరియు ఇతరులను విశ్వసించడం కష్టంగా అనిపించవచ్చు లేదా మీరు దేవుడు, దెయ్యం, ఆత్మలు లేదా గ్రహాంతరవాసుల వంటి బయటి శక్తులు చే నియంత్రించబడుతున్నారని మీరు నమ్మవచ్చు.
ఈ అనుభవాలు మీ చుట్టూ ఉన్న ఇతరులు అవి నిజం కాదని చూడగలిగినప్పటికీ మీకు నిజంగానే జరుగుతున్నట్టుగా అనిపిస్తాయి.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ లక్షణాలు అన్నివేళలా అనుభవించే అవకాశం లేదని గమనించాలి. దానికి బదులుగా, మీరు వేర్వేరు సమయాల్లో వేర్వేరు లక్షణాలను అనుభవించే అవకాశం ఉంది, మరియు ఈ లక్షణాలు అనేక అంశాలపై ఆధారపడి అలాగే వాటి తీవ్రత ఎక్కువ లేదా తక్కువ ఉంటాయి. ఉదాహరణకు, మొదట మీకు కొన్ని తప్పు నమ్మకాలు (డెల్యూషన్స్) రావచ్చు, తర్వాత కొంతకాలానికి లేని విషయాలు కనిపించడం లేదా వినిపించడం (హాల్యూసినేషన్స్) మొదలవచ్చు. దీంతో మీకు మీరు అనారోగ్యంగా ఉన్నారని గుర్తించడం కష్టమవుతుంది..
మీరు సైకోసిస్‌ను అనుభవిస్తున్నప్పుడు, పైన వివరించిన లక్షణాలను మీరు అనుభవిస్తున్నారని గ్రహించడం కూడా మీకు కష్టంగా అనిపించవచ్చు. దురదృష్టవశాత్తు, దీనివల్ల సహాయం కోసం ముందుకు రావడం , సహాయం కోరడాన్ని కష్టతరం చేస్తుంది.
భ్రమలను వాస్తవికత నుండి వేరు చేయడం
మీరు భ్రమలతో బాధపడుతున్నారని ఇతరులు గ్రహించడం కష్టంగా ఉండవచ్చు. ముఖ్యంగా మీ జీవితంలోని విషయాలు మీ భ్రమలతో ముడిపడి ఉన్నప్పుడు, లేదా మీ భ్రమలు వాస్తవ సంఘటనలపై ఆధారపడి ఉన్నప్పుడు, ఇది ఇంకా కష్టంగా మారుతుంది. ఉదాహరణకు:
మతం
మీరు మతపరంగా ఉంటే లేదా మత విశ్వాసి అయితే, ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడగలమని నమ్మడం సాధారణమైన విషయం కావచ్చు. అయితే, ఈ నమ్మకాలు ఎక్కువైపోతే లేదా అతిగా మారితే, లేదా మీ సంబంధాలపై ప్రభావం చూపితే, అది మీరు బాగోలేరని తెలియజేస్తుంది.
ఉద్యోగం
మీ ఉద్యోగం ఈ నమ్మకాలతో కలిసిపోయి ఉంటే లేదా మీ భ్రమలతో ముడిపడి ఉన్న ఉద్యోగం మీకు ఉన్నట్లయితే, మీరు భ్రమలతో బాధపడుతున్నారని ఇతరులు గ్రహించడం కష్టంగా ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు ప్రభుత్వం లేదా సైన్యం వంటి సంస్థలలో రహస్య సమాచారంతో పనిచేయవలసి వచ్చి, నిఘాకు సంబంధించిన భ్రమలతో బాధపడుతుంటే. ఇతరులు గ్రహించడం కష్టంగా ఉండవచ్చు.
వ్యక్తిగత జీవితం
మీ వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని విషయాల వల్ల, ఎవరో మిమ్మల్ని నియంత్రిస్తున్నారో లేదా గమనిస్తున్నారో అనిపించవచ్చు. ఉదాహరణకు, బాధించే లేదా హింసించే సంబంధంలో ఉండటం. మిమ్మల్ని ఎవరో అనుసరిస్తున్నారని లేదా నియంత్రిస్తున్నారని మీరు భ్రమపడటం ప్రారంభిస్తే, మీరు అనారోగ్యంతో ఉన్నారని ఇతరులు గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.
మీరు భ్రమలను అనుభవిస్తున్నట్లయితే, మీకు కలిగే ఆలోచనలు మరియు భావనలు సాధారణం కంటే మరింత తీవ్రంగా ఉంటాయి, మరియు అవి ఇతరులకు వింతగా లేదా మీ స్వభావానికి విరుద్ధంగా అనిపించవచ్చు.
సైకోసిస్ ఎలా అనిపిస్తుంది?
సైకోసిస్‌ను అనుభవించని వారికి అది ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. మానసిక రుగ్మతను (సైకోసిస్‌ను) స్వయంగా అనుభవించిన కొంతమంది వ్యక్తులు తమ అనుభవాలను ఇక్కడ పంచుకోవడానికి దయతో అంగీకరించారు:
“నేను ఆసుపత్రి కార్ పార్కింగ్‌లో కూర్చుని ఉండగా, నేను ఒక చాలా పెద్ద, బోలుగా ఉన్న గోళం లోపల ఉన్నట్లు నాకు అనిపించింది. నా చుట్టూ కనిపించినది అంతా ముదురు బూడిద రంగు, నలుపు రంగు జిగ్‌సా ముక్కలతో చేసినట్టుగా ఉన్న గోళం మాత్రమే. ఇవి బయటకు పడటం మొదలుపెట్టి, నన్ను ఒక నల్లని శూన్యంలో వదిలేశాయి. నేను చాలా భయపడ్డాను. ప్రపంచం ముక్కలైపోయి, మన గ్రహానికి అంతం వచ్చినట్లుగా అనిపించింది.” - డెబ్రా
“నాకు ఓడరేవు (నౌకాశ్రయం) కనిపించేది, అక్కడ ఉన్న నౌకల పేర్లను కూడా కొంచెం గుర్తించగలిగాను. “నేను తీవ్రమైన సైకోసిస్‌లో ఉన్నాను, కాబట్టి ఆ నౌకలు, క్రేన్లు, డాక్స్‌ను తాకాలనుకున్నట్టుగా కిటికీ బయటకు నా చేతిని చాచాను.” మైకేల్
“నాకు చాలా భయంకరమైన నొప్పి ఉందని నేను అనుకునేవాడిని. ఇది భ్రమ కాదు, ఇంద్రియ భ్రాంతి – నేను దానిని నిజంగా అనుభూతి చెందగలిగాను. నేను గొంతులు వినిపిస్తున్నప్పటికీ కూడా ఆ నొప్పి అలాగే ఉండేది — దీంతో నా అనుభవాలు మరింత నిజంగా అనిపించేవి. చాలా సార్లు, భయంకరమైన ఆలోచనలు వచ్చినప్పుడు నాకు తలనొప్పి కూడా వచ్చేది.” మార్క్
సైకోసిస్ ఇతర మానసిక వ్యాధులతో ఎలా సంబంధం కలిగి ఉంటుంది?
సైకోసిస్ అనేది కొన్ని లక్షణాల సమూహాన్ని చెప్పడానికి వాడే పదం. ఇది చాలా విషయాలను కలుపుకునే ఒక పదం. వేర్వేరు రకాల సమస్యలు ఉన్న వాళ్లకు కూడా సైకోసిస్ లక్షణాలు రావచ్చు. వాటిలో ఇవి కూడా ఉన్నాయి:
- స్కిజోఫ్రెనియా
- స్కిజోఅఫెక్టివ్ డిసార్డర్
- ద్విధ్రువ వికారం
- తీవ్రమైన నిరాశ
సాధారణ ఆందోళన వికారం లేదా ఆందోళన-ప్రవర్తనా వికారం (OCD) వంటి ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితులు కూడా ఒక వ్యక్తిలో సైకోసిస్ అభివృద్ధికి దారితీయవచ్చు. ఈ పరిస్థితికి సంబంధించిన తీవ్రమైన ఒత్తిడి ఫలితంగా ఇలా జరగవచ్చు.
ఒక వ్యక్తికి ఈ క్రింది పరిస్థితులు ఉన్నప్పుడు కూడా సైకోసిస్ రావచ్చు:
- మెదడుకు గాయం అయినప్పుడు
- మద్యపానం మానేస్తున్నప్పుడు
- నిద్రలేమికి గురైనప్పుడు
- గంజాయి లేదా కొకైన్ వంటి వినోదభరితమైన మత్తుపదార్థాలను తీసుకున్నప్పుడు
- వినోదభరితమైన మత్తుపదార్థాలను మానేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు
- మూత్రనాళ ఇన్ఫెక్షన్ వంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. కొన్నిసార్లు ఇన్ఫెక్ష ‘డెలిరియం’ అనే స్థితిని కలిగించవచ్చు. కొన్నిసార్లు మతిభ్రమణం అనే పరిస్థితి కి కారణమవుతాయి, దీనివల్ల ప్రజలు అయోమయానికి గురవ్వడం మరియు కొన్నిసార్లు మానసిక రుగ్మత లక్షణాలు అభివృద్ధి చెందడం జరుగుతుంది.. మతిభ్రమణానికి కారణమైన వ్యాధికి చికిత్స చేసినప్పుడు, సాధారణంగా మానసిక రుగ్మత లక్షణాలు మెరుగుపడతాయి.
కొత్తగా ప్రారంభించిన మందుల కారణంగా ఈ దుష్ప్రభావం కలగవచ్చు, అలాగే మందులను నిలిపివేసినప్పుడు కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు.
కొన్నిసార్లు ఎవరికీ సైకోసిస్ ఎందుకు వచ్చిందో ఖచ్చితంగా చెప్పడం కష్టంగా ఉంటుంది.
సైకోసిస్ అనేది వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అర్థాలను ఇస్తుంది:
- ముఖ్యమైన జీవిత సంఘటనలు - సన్నిహిత స్నేహితుడు లేదా బంధువు మరణించడం వంటి ముఖ్యమైన లేదా ఒత్తిడితో కూడిన సంఘటన తర్వాత కొన్నిసార్లు సైకోసిస్ సంభవించవచ్చు. బాల్యం లో ఎవరైనా వేధింపులకు లేదా నిర్లక్ష్యానికి గురైతే, అది అభివృద్ధి చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
- ప్రసవం - ప్రసవం తర్వాత మానసిక రుగ్మత (సైకోసిస్) కలగవచ్చును; దీనిని ప్రసవానంతరం మానసిక రుగ్మత (పోస్ట్‌పార్టమ్ సైకోసిస్). అంటారు.
- మత్తుపదార్థాలు - గంజాయి, LSD, కొ కైన్ లేదా ‘స్పీడ్’ వంటి చట్ట విరుద్ధమైన మత్తుపదార్థాలను ఉపయోగపరచిన తర్వాత మానసిక రుగ్మత (సైకోసిస్) సంభవించును’ కొన్నిసార్లు ఎవరైనా మత్తుపదార్థాలు లేదా మద్యం వాడటం మానేస్తే వారి మానసిక రుగ్మత మెరుగుపడుతుంది. అయితే, కొన్నిసార్లు మత్తుపదార్థాలకు, సైకోసిస్ మధ్య సంబంధం మరింత సంక్లిష్టంగా ఉంటుంది. మీరు మాదకద్రవ్యాలు వాడుతున్నట్లయితే, వాటిని ఆపడానికి సహాయం ఎలా పొందాలో మీకు చికిత్స అందిస్తున్న వారితో మాట్లాడండి.
- ఒక వ్యక్తికి మానసిక స్థితి రుగ్మత ఉన్నప్పుడు - ఒక వ్యక్తి తీవ్రమైన కుంగుబాటు దశకు లేదా ఉన్మాద దశకు గురైనప్పుడు సైకోసిస్ సంభవించవచ్చు.
- నిద్రలేమి – తీవ్రమైన నిద్రలేమి సైకోసిస్ మానసిక రుగ్మత కు కారణం కావచ్చు.
చాలా మంది ఒత్తిడికి గురైనా, మత్తుపదార్థాలు వాడినా లేదా బిడ్డకు జన్మనిచ్చినా, వారికి ఎప్పుడూ సైకోసిస్ రాదనే విషయం గమనించడం ముఖ్యం. కొన్నిసార్లు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే సైకోసిస్ సంభవిస్తుంది. కారణం ఏదైనప్పటికీ, మీకు సైకోసిస్ వస్తే అది మీ తప్పు కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం.
మీ చికిత్సకు సహాయపడగలదేమోనని, మీకు సైకోసిస్ రావడానికి కారణమేమిటో మీ డాక్టర్ కనుక్కోవాలనుకోవచ్చు. ఉదాహరణకు, మీరు మత్తుపదార్థాలు తీసుకుంటున్నట్లయితే, వాటిని మానేయడానికి మీకు సహాయం చేయడం అనేది మీరు కోలుకోవడంలో ఒక ముఖ్యమైన భాగం కావచ్చు. అయితే, మీరు పరిస్థితులను తట్టుకోవడానికి మందులు లేదా మద్యం వాడుతున్నప్పటికీ, అది సైకోసిస్‌కు సకాలంలో, ఆధార-ఆధారిత చికిత్స పొందకుండా మిమ్మల్ని ఆపకూడదు.
నాకు సైకోసిస్ వస్తోందని అనిపిస్తే నేను ఏమి చేయాలి?
మీరు సైకోసిస్‌కు సంబంధించిన ఏవైనా లక్షణాలను ఎదుర్కొంటున్నట్లయితే, మీ సాధారణ వైద్యుడితో మాట్లాడండి. వారు మిమ్మల్ని ఒక ప్రత్యేక మానసిక ఆరోగ్య సేవకు లేదా సైకోసిస్‌లో ప్రారంభ జోక్య సేవకు రిఫర్ చేసే అవకాశం ఉంది.
సైకోసిస్‌లో ప్రారంభ జోక్య సేవలు
సైకోసిస్‌లో ప్రారంభ జోక్య (EIP) సేవలు అనేవి సైకోసిస్ అనుభవిస్తున్న లేదా అనుభవించే అవకాశం ఉన్న వ్యక్తులు త్వరగా సరైన సంరక్షణ పొందేలా ఏర్పాటు చేసిన సేవా నమూనా. సైకోసిస్‌కు త్వరగా సహాయం పొందితే, వారు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉండటమే కాకుండా, త్వరగా కోలుకునే అవకాశము కూడా ఎక్కువగా ఉంటుందని చూపించే అనేక ఆధారాలు ఉన్నాయి.
మూల్యాంకనం
మీరు మానసిక లక్షణాలను అనుభవిస్తున్నట్లయితే, సైకోసిస్‌లో నైపుణ్యం ఉన్న నిపుణుడు దీని గురించి మరింత తెలుసుకోవడానికి మిమ్మల్ని మూల్యాంకనం చేయాలి:
- కొంతమందికి సైకోసిస్ యొక్క ఒకే ‘దశ’ మాత్రమే ఉంటుంది. అంటే, వారికి ఒకసారి సైకోసిస్ వస్తుంది, తర్వాత కోలుకుంటారు, మళ్లీ అది రావడం ఉండదు.
- కొంతమందికి వారి జీవితకాలంలో సైకోసిస్ యొక్క అనేక దశలు వస్తాయి.
- వీరిలో కొందరికి స్కిజోఫ్రీనియా, స్కిజోఅఫెక్టివ్ డిజార్డర్ లేదా సంబంధిత సైకోటిక్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. మీకు అందిన రోగ నిర్ధారణ చాలా క్లిష్టంగా అనిపించవచ్చు, కాబట్టి ఆ రోగ నిర్ధారణలోని వివిధ భాగాల అర్థం ఏమిటో వివరించమని మీరు మీ వైద్యుడిని అడగవచ్చు.
మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు సైకోసిస్ లక్షణాలను అనుభవించి, మీకు స్కిజోఫ్రీనియా లేదా స్కిజోఅఫెక్టివ్ డిజార్డర్ వంటి వ్యాధి ఎందుకు నిర్ధారణ కాలేదో తెలుసుకోవాలనుకుంటే, మీ వైద్యుడితో మాట్లాడండి. మీ అనుభవాలను ఈ నిర్ధారణల్లో ఏదో ఒకటి సరిపోదని మీ డాక్టర్ అనిపించడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు.
సైకోసిస్ ఎందుకు వస్తుంది?
సైకోసిస్‌కు కారణమేమిటో మనకు ఎల్లప్పుడూ తెలియదు. సైకోసిస్ సంభవించే అవకాశాన్ని పెంచే కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిలో ఇవి కూడా ఉన్నాయి:
- మీ మానసిక ఆరోగ్యం
- మీరు మాదక ద్రవ్యాలు లేదా మద్యం ఉపయోగిస్తున్నారా
- మీరు తీసుకుంటున్న ఏదైనా ఔషధం
- మీకు ఉండే ఏవైనా శారీరక ఆరోగ్య పరిస్థితులు మరియు మీ సాధారణ శారీరక ఆరోగ్య స్థితి
- మీ యొక్క బంధాలు మరియు మద్దతు నెట్‌వర్క్‌లు - ఉదాహరణకు, మీకు ఒక సంరక్షకులు మద్దతు ఇస్తున్నట్లయితే
- మీరు గతంలో అనుభవించిన ఏవైనా బాధాకరమైన లేదా కఠినమైన అనుభవాలు
- మీ విద్య మరియు ఉపాధి చరిత్ర
- మీ సాధారణ జీవన నాణ్యత.
ఇది చాలా సమాచారం లాగా అనిపించవచ్చు. అయితే, ఇది మీకు చికిత్స అందిస్తున్న వారికి మీరు ఎలా జీవిస్తున్నారు, మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఏమిటి మరియు వారు మీకు సహాయం చేయగల అన్ని మార్గాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
దురదృష్టవశాత్తు, మీరు సైకోసిస్ ఎపిసోడ్‌ను అనుభవిస్తున్నట్లయితే, మీరు అనారోగ్యంగా ఉన్నారని గుర్తించలేకపోవచ్చు. ఇది సహాయం పొందడం మరింత కష్టంగా మారేలా చేయవచ్చు.
సైకోసిస్‌ను గుర్తించడానికి ఎలాంటి శారీరక పరీక్ష లేదు. బదులుగా, మిమ్మల్ని మూల్యాంకనం చేసే వ్యక్తి మీరు అనుభవిస్తున్న ఏవైనా లక్షణాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది వారికి ఖచ్చితమైన నిర్ధారణ చేయడంలో సహాయపడుతుంది.
సైకోసిస్‌కు ఎలా చికిత్స చేస్తారు?
సైకోసిస్ ఉన్న వ్యక్తికి సహాయపడగల అనేక విధానాలు ఉన్నాయి. ఈ విధానాలు వేర్వేరు సమయాల్లో మరియు వేర్వేరు రీతుల్లో ఉపయోగపడవచ్చు.
దురదృష్టవశాత్తు, ఈ విభాగంలో మేము పేర్కొన్న కొన్ని సేవలు UK అంతటా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండవు. కొన్ని సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, మీరు వాటిని వెంటనే పొందలేకపోవచ్చు.
ఔషధం
మీరు మొదటిసారి సైకోసిస్‌ను అనుభవిస్తున్నట్లయితే, మీకు యాంటీసైకోటిక్ అనే ఔషధాన్ని ఇచ్చే అవకాశం ఉంది.
యాంటీసైకోటిక్‌లు ఎలా పనిచేస్తాయి?
యాంటీసైకోటిక్‌లు మీ మెదడులోని వివిధ రసాయనాలపై ప్రభావం చూపుతాయి, ముఖ్యంగా ‘డోపమైన్’ అనే రసాయనంపై. భ్రమలు మరియు మాయాభాసాలు వంటి మానసిక లక్షణాలు మెదడు అధికంగా డోపమైన్ ఉత్పత్తి చేయడం వల్ల కలుగుతాయని భావిస్తారు. యాంటీసైకోటిక్‌లు మెదడులో డోపమైన్ స్థాయిలను తగ్గించడం ద్వారా పనిచేస్తాయి, దీనివల్ల మానసిక లక్షణాలు తగ్గవచ్చు లేదా మెరుగుపడవచ్చు.
సెరటోనిన్, నోరాడ్రెనలిన్, హిస్టమిన్ మరియు గ్లూటామేట్ వంటి ఇతర మెదడు రసాయనాలు కూడా సైకోసిస్‌లో ప్రభావితమవుతాయని భావిస్తున్నారు. చాలా యాంటీసైకోటిక్‌లు ఈ రసాయనాల స్థాయిలపై కూడా ప్రభావం చూపుతాయి.
యాంటీసైకోటిక్‌ల వల్ల దుష్ప్రభావాలు ఉంటాయా?
అన్ని ఔషధాలకు దుష్ప్రభావాలు ఉంటాయి మరియు ఇవి వ్యక్తి మరియు ఔషధ రకాన్ని బట్టి మారవచ్చు. మీరు యాంటీసైకోటిక్ తీసుకోవడం ప్రారంభిస్తే కలిగే అవకాశం ఉండే దుష్ప్రభావాల గురించి మీ వైద్యుడు వివరించాలి, అలాగే మీ ఔషధం మరియు మీకు ఉండే ఏవైనా ఆందోళనల గురించి చర్చించే అవకాశం మీకు ఇవ్వాలి.
మీకు సూచించిన ఔషధం వల్ల ఏర్పడే సాధారణ దుష్ప్రభావాలను వివరించే ఒక కరపత్రాన్ని కూడా మీకు అందించాలి. ఈ కరపత్రాన్ని చదవడానికి సమయం కేటాయించండి మరియు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీకు ఔషధం సూచిస్తున్న వ్యక్తిని అడగండి.
మీరు తీసుకుంటున్న ఔషధం మీకు అసౌకర్యమైన దుష్ప్రభావాలు కలిగిస్తున్నట్లు మీకు అనిపిస్తే, మీ వైద్యుడితో మాట్లాడండి. మీ లక్షణాలను నయం చేస్తూ, మీకు భరించలేని లేదా ఇబ్బందికరమైన దుష్ప్రభావాలను కలిగించని ఔషధాన్ని కనుగొనడంలో వారు మీకు సహాయపడాలి. మీకు యాంటీసైకోటిక్‌లు సూచించే సమయంలో, మీరు తీసుకుంటున్న ఇతర ఔషధాలను మరియు వాటి మధ్య ఉండే సంభావ్య పరస్పర ప్రభావాలను కూడా మీ వైద్యుడు పరిగణనలోకి తీసుకోవాలి. ఔషధాల మధ్య పరస్పర ప్రభావాల గురించి మరింత సమాచారం కోసం మీరు BNF వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
ఆరోగ్య పర్యవేక్షణ
ఏదైనా యాంటీసైకోటిక్ని ఉపయోగించడం ప్రారంభించే ముందు మీకు పూర్తి శారీరక ఆరోగ్య స్క్రీనింగ్‌ను అందించాలి. ఇందులో ఇవి ఉంటాయి:
- మధుమేహం మరియు అధిక కొలెస్ట్రాల్ వంటి పరిస్థితులను గుర్తించడానికి రక్త పరీక్షలు
- భౌతిక పరిశీలనలు (ఉదాహరణకు రక్తపోటు, హృదయ స్పందన రేటు మరియు శరీర ఉష్ణోగ్రత)
- ఎత్తు, మరియు శరీర బరువు చెక్‌లు, మరియు అవసరమైతే మీ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) చెక్‌లు
- హృదయపు విద్యుత్ క్రియాశీలతను కొలిచే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ECG)
- మీకు సంబంధించినవి అయితే, ధూమపానం, ఆల్కహాల్ తీసుకోవడం మరియు మాదక ద్రవ్యాల వినియోగం గురించి చర్చ.
మీరు సైకోసిస్ చికిత్సకు సూచించబడిన ఔషధాలు తీసుకుంటున్నప్పుడు, ప్రతి ఏడాదికి కనీసం ఒకసారి శారీరక ఆరోగ్య పర్యవేక్షణ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. ఈ ఆరోగ్య చెక్‌లను మీ సాధారణ వైద్యుడు లేదా మానసిక ఆరోగ్య బృందం నిర్వహించవచ్చు. మీ శారీరక ఆరోగ్య చెక్‌లను ఎవరు నిర్వహిస్తారు మరియు ఏవైనా ఆరోగ్య సమస్యలు గుర్తించబడినట్లయితే ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి మీ మానసిక ఆరోగ్య బృందంతో మాట్లాడండి.
కొన్ని ఇతర ఔషధాలు, మద్యం, చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు మరియు సిగరెట్లతో సహా కొన్ని విషయాలు యాంటీసైకోటిక్‌లపై ప్రమాదకరమైన సంకర్షణ ప్రభావం చూపవచ్చు. మీరు మీ వైద్యుడితో మాట్లాడటం ముఖ్యం:
- ఏదైనా ఇతర ఔషధాలను తీసుకోవడం ప్రారంభించే ముందు
- మీరు మద్యం సేవిస్తున్నట్లయితే
- మీరు చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తున్నట్లయితే
- మీరు ఎక్కువ కెఫిన్ తీసుకుంటున్నట్లయితే (ఎల్లప్పుడూ కాకుండా, ప్రత్యేకించి కొన్ని సార్లు మాత్రమే తీసుకుంటున్నట్లయితే)
- మీరు సిగరెట్లు మొదలుపెట్టాలని, ఆపాలని లేదా తగ్గించాలనుకున్నట్లయితే. మీరు ధూమపానం మానేస్తే, మీ రక్తంలో యాంటీసైకోటిక్ స్థాయి పెరుగుతుంది, అప్పుడు మీకు తక్కువ మోతాదులో ఔషధం అవసరం కావచ్చు. మీరు క్లోజాపైన్ తీసుకుంటున్నట్లయితే ఇది చాలా ముఖ్యం (క్లోజాపైన్ గురించి మరింత తెలుసుకోవడానికి తరువాతి విభాగాన్ని చదవండి).
- ఇవి మీ శరీరంలో ఔషధ స్థాయిలను మార్చవచ్చు కాబటి, మీకు సంక్రమణ వ్యాధి ఉన్నట్లయితే.
ఆరోగ్య పర్యవేక్షణ ఎందుకు అవసరం?
సైకోసిస్ ఉన్న వ్యక్తులు సాధారణంగా శారీరక ఆరోగ్యం, ముఖ్యంగా గుండె సంబంధిత ఆరోగ్యం విషయంలో హానికరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు, కాబట్టి దీన్ని జాగ్రత్తగా పర్యవేక్షించాలి. మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడేతందుకు, మీ వైద్యుడు జీవన శైలి మార్పులు చేయాలని, మీ ఔషధాన్ని విభిన్నంగా నిర్వహించాలని లేదా కొన్ని దుష్ప్రభావాలను (ఉదాహరణకు బరువు పెరగడం) నివారించడానికి అదనపు ఔషధాలు తీసుకోవాలని సిఫార్సు చేయవచ్చు.
నాకు ఏ యాంటిసైకోటిక్ ఇవ్వబడుతుంది?
అనేక రకాల యాంటీసైకోటిక్ ఔషధాలు ఉన్నాయి. మరింత ప్రభావవంతంగా పనిచేసే క్లోజాపైన్ కాకుండా, అన్ని యాంటీసైకోటిక్ ఔషధాలు కూడా స్థిరంగా ఒకే విధంగా ప్రభావవంతంగా ఉంటాయని చూపించబడింది. ఒక యాంటీసైకోటిక్ నుండి మరొకదానికి మారేవి ఏమిటంటే, వ్యక్తులు వాటిని తీసుకునే సమయంలో వారు ఎదుర్కొనే దుష్ప్రభావాల రకాలు మరియు వాటి తీవ్రత.
ఈ కింది విషయాలకు అవకాశాలు ఉంటే, మీరు కొన్ని యాంటీసైకోటిక్‌లు తీసుకోవద్దని సలహా ఇవ్వబడుతుంది:
- గర్భం ధరించగలిగితే
- కొన్ని ఇతర ఔషధాలు తీసుకుంటున్నట్లయితే
- మధుమేహం లేదా అధిక రక్తపోటు వంటి కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే.
మీ వైద్యుడు ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, మీకు అత్యుత్తమంగా పనిచేసే యాంటీసైకోటిక్‌ను ఎంచుకునే ప్రక్రియలో మీతో కలిసి పని చేయాలి.
క్లోజాపైన్
క్లోజాపైన్ మాత్రమే, ఇతర యాంటీసైకోటిక్‌లు పనిచేయని వ్యక్తులలో నిరంతరం ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధనలలో చూపబడిన యాంటీసైకోటిక్. మీ కింద పేర్కొన్న పరిస్థితుల్లో మీకు క్లోజాపైన్ ప్రారంభించాలని సిఫార్సు చేయవచ్చు:
- మీరు కనీసం కొన్ని వారాల పాటు రెండు భిన్న యాంటీసైకోటిక్ ఔషధాలను ప్రయత్నించి మరియు
- మీరు ఇంకా సైకోటిక్ లక్షణాల కారణంగా సమస్యలను ఎదుర్కొంటుతున్నట్లయితే.
మీరు క్లోజాపైన్ తీసుకోవడం ప్రారంభిస్తే, మీరు ఇప్పటికే ముందు విభాగంలో వివరించిన సాధారణ శారీరక ఆరోగ్య తనిఖీలను పొందుతారు. అదనంగా, మీరు క్లోజాపైన్ తీసుకుంటున్న సమయంలో దగ్గరగా పర్యవేక్షణ పొందుతారు:
- మీరు క్లోజాపైన్ ప్రారంభించిన మొదటి 18 వారాల పాటు, ప్రతి వారం ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవాలి.
- తరువాత, క్లోజాపైన్ ప్రారంభించిన తర్వాత ఒక సంవత్సరం వరకు, ప్రతి రెండు వారాలకు ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవాలి.
- ఒక సంవత్సరం తరువాత, మీరు క్లోజాపైన్ ఉపయోగిస్తున్నంతకాలం ప్రతి నాలుగు వారాలకు ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవాలి.
రక్త పరీక్షలు
క్లోజాపైన్ తీసుకుంటున్నప్పుడు, పూర్తి రక్త లెక్క అనే రెగ్యులర్ రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది క్లోజాపైన్ కారణంగా సంభవించే చాలా అరుదైన దుష్ప్రభావాన్ని పరిశీలించడానికి చేయబడుతుంది, దీనిలో శరీరంలోని తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. తెల్ల రక్త కణాలు ఇన్ఫెక్షన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి, వీటికి తగినంత సంఖ్య లేకపోతే, మీరు తీవ్రమైన అస్వస్థతకు గురవచ్చు. రెగ్యులర్ రక్త పరీక్షలు డాక్టర్లకు ఇది జరగకపోవడాన్ని నిర్ధారించడంలో సహాయపడతాయి.
అలాగే, ప్లాస్మా స్థాయి పర్యవేక్షణ అనే రకమైన రక్త పరీక్ష అవసరమయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్ష రక్తంలో క్లోజాపైన్ పరిమాణాన్ని కొలుస్తుంది. ఇది మీరు సరైన మోతాదులో క్లోజాపైన్ తీసుకుంటున్నారా అని నిర్ధారించడానికి, అలాగే క్లోజాపైన్ వినియోగంతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి లేదా నిష్కర్షించడానికి ఉపయోగపడవచ్చు.
సమాధానాలు సూచిస్తున్నాయి, భవిష్యత్తులో కొంతమంది వ్యక్తులు ప్రస్తుతానికి చేసే రక్త పరీక్షలను అంత తరచుగా అవసరం లేకపోవచ్చు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు మారితే, మీ మానసిక ఆరోగ్య బృందం మీతో చర్చిస్తుంది.
క్లోజాపైన్ తీసుకుంటున్నప్పుడు, మీరు క్లోజాపైన్‌ను సూచించినట్లుగా తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం. 48 గంటలకంటే ఎక్కువగా డోస్ మిస్స్ అయితే, తదుపరి డోస్ తీసుకోవడానికి ముందు వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. ఎందుకంటే, కొంతకాలం విరామం తర్వాత పూర్తిస్థాయి మోతాదు తీసుకోవడం సురక్షితం కాకపోవచ్చు.
దుష్ప్రభావాలు
క్లోజాపైన్ తీసుకునే వ్యక్తులు కొన్ని ఇతర దుష్ప్రభావాలను కూడా అనుభవించవచ్చు. వీటిలో కొన్ని అన్ని యాంటీసైకోటిక్‌లలో ఉన్నవే, కానీ కొన్ని క్లోజాపైన్‌లో ప్రత్యేకంగా సాధారణంగా కనిపిస్తాయి:
- బరువు పెరుగుట
- అలసట
- మలబద్ధకం.
క్లోజాపైన్ కొంతమందిలో హృదయ స్పందనను వేగంగా చేస్తుంది (సైనస్ టాకీకార్డియా అని అంటారు). ఇది క్లోజాపైన్ ప్రారంభించినప్పుడు శరీరానికి సాధారణ ప్రతిస్పందన కావచ్చు. కానీ ఇది హృదయానికి నష్టం ఉన్న సంకేతంగా కూడా ఉండవచ్చు. ఈ పరిస్థితి కొనసాగితే, హృదయ నష్టం సంబంధిత ఇతర లక్షణాలు ఉన్నాయా అని తనిఖీ చేయించుకోవాలి.
ఈ దుష్ప్రభావాలు భయంకరంగా అనిపించవచ్చు, కానీ ఎక్కువ భాగం సులభంగా నిర్వహించబడుతుంది.
ఔషధాన్ని ఎంత కాలం తీసుకోవాలి?
చాలా మంది ఔషధం ఎంతకాలం తీసుకోవాలో, భవిష్యత్తులో ఆ ఔషధం తీసుకోవడం ఆపగలమా అని తెలుసుకోవాలనుకుంటారు. ఇది అంచనా వేయడం కష్టతరమే, మరియు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
మొదట 1–2 సంవత్సరాలలో మీ ఔషధం తీసుకోవడం ఆపితే, రీలాప్స్ (relapse) వచ్చే అధిక ప్రమాదం ఉంది. రీలాప్స్ అంటే మరిన్ని సైకోసిస్ ఎపిసోడ్‌లు అనుభవించడం. ఔషధం కొనసాగించడం, భవిష్యత్తులో రీలాప్స్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
మంచి ఆరోగ్య స్థితి కోసం, మీరు ఔషధం ఆపి మరో సైకోసిస్ ఎపిసోడ్ ఎదుర్కొంటే, మళ్ళీ ఔషధం తీసుకోవాలి, మరియు ఆరోగ్యంగా ఉండడానికి కొనసాగించాలి. మీరు ఎంతకాలం ఔషధం తీసుకోవాలి అనేది మీ వ్యక్తిగత పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
ఔషధం ఆపితే ఏమవుతుంది?
ఔషధం తీసుకోవడం ఆపితే, మీరు మళ్ళీ అస్వస్థంగా అయ్యే అవకాశం ఉంది. రీలాప్స్ ఎక్కువగా సంభవిస్తే, మళ్ళీ కోలుకోవడం కష్టతరం అవుతుంది. ప్రతి సారి కోలుకోవడం స్థాయి కూడా మునుపటి లాగా ఉండకపోవచ్చు. అందుకే డాక్టర్లు ఔషధం తీసుకోవడం కొనసాగించమని సిఫార్సు చేస్తారు.
మీరు ఔషధం ఆపాలనుకుంటే లేదా ఆలోచిస్తే, ముందుగా మీ మానసిక ఆరోగ్య నిపుణుడు లేదా సాధారణ వైద్యుడితో సంప్రదించడం అత్యంత ముఖ్యము. వారు ఔషధం ఆపినప్పుడు లాభాలు, నష్టాలు, మరియు తీసుకోవడానికి ఉత్తమ మార్గాన్ని చర్చిస్తారు.
దీర్ఘకాలం పనిచేసే ఇంజెక్టబుల్స్
డిపోట్ ఔషధం అని కూడా పిలవబడే దీర్ఘకాలం పనిచేసే ఇంజెక్టబుల్స్, టాబ్లెట్ రూపంలో కాకుండా కండరంలో ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడతాయి. ఔషధం కొన్ని వారాల పాటు శరీరంలో నెమ్మదిగా విడుదల అవుతుంది.
దీర్ఘకాలం పనిచేసే సూది మందులో ఉండే ఔషధము మాత్రలలోనూ వుంటుంది.
కొంతమంది ప్రజలు ప్రతిరోజూ ఔషధ మాత్రలు వాడే పధ్ధతి కంటే ఎక్కవకాలం పని చేసే ఇంజక్షన్లకే ప్రాధాన్యతను ఇస్తారు. అయితే, ఇంకొందరికి సూది మందులు అంటే ఇష్టం ఉండదు, ప్రతిరోజూ మాత్రలు వేసుకోడానికి ప్రాధాన్యత ఇస్తారు.
యాంటీసైకోటిక్ మందులను టాబ్లెట్ రూపంలో వేసుకునే వారితో పోలిస్తే, దీర్ఘకాలం పనిచేసే ఇంజెక్షన్లు వాడే వారిలో మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీర్ఘకాలం పనిచేసే ఇంజెక్షన్ రూపంలో లభించే యాంటీసైకోటిక్ మందుల గురించి మరింత సమాచారాన్ని మా సమాచార వనరులో తెలుసుకోవచ్చు.
మానసిక చికిత్సలు
మానసిక చికిత్సలు లేదా 'వాక్చికిత్సలు' అంటే మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చికిత్సకునితో ఒంటరిగా లేదా గ్రూపులో మాట్లాడటం.
సైకోసిస్, స్కిజోఫ్రీనియా మరియు స్కిజోఅఫెక్టివ్ డిజార్డర్‌లకు చికిత్స చేయడం కోసం మానసిక చికిత్సలను సిఫార్సు చేస్తారు. అవి ప్రభావవంతంగా పనిచేస్తాయనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. మందులతో పాటు మానసిక చికిత్స కూడా అందించబడాలి ఎందుకంటే, ఇటువంటి చికిత్స మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
వివిధ మానసిక చికిత్సలు మీకు ఎంత ఉపయోగపడతాయి అనేది మీపైన, మీ ప్రత్యేక పరిస్థితిపైన ఆధారపడి ఉంటుంది.
అయితే, మీరు ఉండే ప్రాంతాన్ని బట్టి మానసిక చికిత్సలు పొందడానికి సమయం పట్టే అవకాశం ఉంది.
జ్ఞానాత్మక ప్రవర్తనా చికిత్స (CBT)
జ్ఞానాత్మక ప్రవర్తనా చికిత్స రోజువారీ పరిస్థితుల్లో మరింత ఉపయోగకరంగా ఆలోచించడం, స్పందించడం వంటివి నేర్చుకోవడానికి మీకు సహాయపడుతుంది. కొన్ని ఇతర వాక్చికిత్సల వలె కాకుండా, జ్ఞానాత్మక ప్రవర్తనా చికిత్స మీ గతం కంటే ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సవాళ్లపై దృష్టి సారిస్తుంది.
మీరు చికిత్సకునితో కలిసి జ్ఞానాత్మక ప్రవర్తనా చికిత్సని కనీసం 16 వారాల పాటు, వారానికో సెషన్ చొప్పున ఇవ్వాలి.
మీకు ఎలా జ్ఞానాత్మక ప్రవర్తనా చికిత్స సహాయపడుతుంది?
మీకు జ్ఞానాత్మక ప్రవర్తనా చికిత్స సహాయపడుతుంది:
- మీ రోగ లక్షణాలకు సంబంధించి, మీ ఆలోచనలు, భావోద్వేగాలు మరియు ప్రవర్తనల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి
- మీకున్న లక్షణాలకు, మీ నమ్మకాలకు మధ్య సంబంధం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి
- మీ లక్షణాలను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకండి
- మీ లక్షణాల వల్ల కలిగే బాధను తగ్గించుకోవడం.
నేను జ్ఞానాత్మక ప్రవర్తనా చికిత్సను ఎప్పుడు మొదలుపెట్టాలి ?
మానసిక చికిత్స సెషన్లలో చురుకుగా పాల్గొనడమే కాకుండా, మిగతా సమయంలో కూడా చికిత్సకుడు చెప్పిన పనులు చేస్తే మానసిక చికిత్సలు మరింత ఉపయోగకరంగా ఉంటాయి. మీరు మానసికంగా అనారోగ్యంగా ఉంటే, మీరు కొంచెం కుదుటపడిన తర్వాత జ్ఞానాత్మక ప్రవర్తనా చికిత్సను మొదలుపెడితే మంచి ఫలితం ఉంటుంది. జ్ఞానాత్మక ప్రవర్తనా చికిత్సలో మీ మనసులో ఉన్న తప్పుడు ఆలోచనలను, భ్రమలను ఎదుర్కొని మార్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి. మీరు ఇలా చేయడానికి సిద్ధంగా లేకపోతే, చికిత్సకునితో మీ బంధం చెడిపోవడమే కాకుండా, మీ మానసిక సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
కళ చికిత్సలు
మీ మనసులోని ఆలోచనలు, భావాలను అర్థం చేసుకోవడానికి కళా చికిత్సల్లో పెయింటింగ్, డ్రాయింగ్ లాంటి సృజనాత్మక పద్ధతులను వాడతారు. కళా చికిత్సల్లో పెయింటింగ్, ఫోటోగ్రఫీ, శిల్పకళ, సంగీతం మరియు రచన వంటివి ఉంటాయి.
కళా చికిత్సలు మీకు ఈ విషయాలలో సహాయపడగలవు:
- మీ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పండి
- ఇతరులతో సంభాషించడానికి కొత్త మార్గాలను కనుగొనండి
- మీకు ఎదురైన అనుభవాలను కళల రూపంలో చెప్పండి.
కుటుంబ ఆధారిత చికిత్సా పద్ధతులు
మీరు కోలుకోవడంలో సహాయపడటానికి, మీకు మీ కుటుంబం అందించే వివిధ రకాల మద్దతునే కుటుంబ ఆధారిత చికిత్సా పద్ధతులు అంటారు.
కుటుంబాలతో కలిసి పనిచేయడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అయితే, కుటుంబ జోక్యాలను మానసిక ఆరోగ్య నిపుణులే నిర్వహించాలి మరియు అవి ఈ క్రింది అంశాలను కలిగి ఉండాలి:
- మానసిక విద్య - మిమ్మల్ని మీ వ్యాధి నిర్ధారణను మీ కుటుంబం బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది
- ఒత్తిడిని నియంత్రించడం మరియు తగ్గించడం
- మీ భావోద్వేగాలను మీ కుటుంబం సమర్థవంతంగా అర్థం చేసుకోవడంలో సహాయపడటం
- మీ ఆలోచనలను, మీరు బలంగా నమ్మే విషయాలను కొత్త కోణంలో చూడడం అలవాటు చేసుకోవడం
- సమస్య పరిష్కారం.
కుటుంబ ఆధారిత చికిత్సా పద్ధతిలో మిమ్మల్ని కూడా చేర్చవచ్చు, లేదా మొదట మీ కుటుంబానికి మాత్రమే వీటిని అందించవచ్చు. కుటుంబ ఆధారిత చికిత్సా పద్ధతులను కనీసం మూడు నెలల పాటు, కనీసం 10 సెషన్ల వరకు అందించాలి.
మిగతా చికిత్సలు
వాక్చికిత్స లాంటివి (అవతార్) ఇంకొన్ని చికిత్సలు కూడా ఉన్నాయి. కానీ, UK లో అన్ని చోట్లా అవి దొరకవు కాబట్టి వాటి గురించి ఇక్కడ పూర్తిగా వివరించలేదు.
ఆసుపత్రిలో చేరడం
మీరు బాగా అనారోగ్యంగా ఉంటే, కోలుకోవడానికి మీరు కొంత కాలం మానసిక వైద్యశాలలో ఉండాల్సి రావచ్చు. మీకు ఇది సహాయకరంగా ఉంటుంది:
- అధిక స్థాయిలో చికిత్స మరియు సంరక్షణ అవసరం
- మీరు మీకు గానీ ఇతరులకు గానీ హాని కలిగించే ప్రమాదంలో ఉన్నారా
- మీరు ఇతరుల వల్ల హాని పొందే ప్రమాదంలో ఉన్నారా.
విభజించబడటం
కొన్ని సందర్భాలలో, మిమ్మల్ని మానసిక ఆరోగ్య చట్టం ప్రకారం ఆసుపత్రిలో నిర్బంధించవలసి రావచ్చు. మీకు హాస్పిటల్ బయట ఉండటం ప్రమాదం అయినప్పుడు, లేదా నీ చికిత్స గురించి మీరే నిర్ణయం తీసుకునే స్థితిలో లేనప్పుడు ఇలా చేయాల్సి వస్తుంది. దీనినే చట్టప్రకారం మానసిక వైద్యశాలలో చేర్చబడడం అంటారు. అంటే చట్టం ప్రకారం మిమ్మల్ని ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స చేస్తారు.
చట్ట ప్రకారం హాస్పిటల్‌లో చేర్చే సెక్షన్లు చాలా రకాలు ఉంటాయి. వాటి వివరాలు మా ‘చట్టప్రకారం మానసిక వైద్యశాలలో చేర్చబడడం’ రిసోర్స్‌లో చూడండి. ఇది కేవలం ఇంగ్లాండ్, వేల్స్ కోసం మాత్రమే. స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌లో చట్టాలు వేరుగా ఉంటాయి.
మానసిక ఆరోగ్య చట్టం కింద మిమ్మల్ని నిర్బంధించి ఉన్నప్పటికీ, మీ చికిత్సకు సంబంధించి మీ అభిప్రాయాన్ని మీ వైద్యులు తప్పక అడగాలి; అలాగే, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మీరు సాధ్యమైనంత ఎక్కువగా భాగస్వాములయ్యేలా వారు మీకు సహాయపడాలి. కొన్ని సందర్భాల్లో, మీ చికిత్సకు సంబంధించి మీ వైద్యులు మీ సన్నిహిత మిత్రుడితో, కుటుంబ సభ్యుడితో లేదా సంరక్షకుడితో మాట్లాడాల్సి రావచ్చు. సమాచార భాగస్వామ్యానికి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి,మానసిక అనారోగ్యంతో బాధపడేవారి సంరక్షణపై మేము రూపొందించిన సమాచార వనరులో మీరు వీటి గురించి మరింత తెలుసుకోవచ్చు.
స్వతంత్ర మానసిక ఆరోగ్య న్యాయవాదులు
మీరు మానసిక ఆరోగ్య చట్టం కింద నిర్బంధించబడితే, స్వతంత్ర మానసిక ఆరోగ్య న్యాయవాదిని (IMHA) సంప్రదించే హక్కు మీకు స్వయంచాలకంగా లభిస్తుంది.
స్వతంత్ర మానసిక ఆరోగ్య న్యాయవాదులు ఈ క్రింది విషయాలపై మంచి అవగాహన కలిగిన వ్యక్తులు:
- మానసిక ఆరోగ్య చట్టం
- మానసిక ఆరోగ్య చట్టం ప్రకారం నిర్బంధించబడిన వ్యక్తుల హక్కులు.
మీరు ఏ మానసిక ఆరోగ్య సంస్థ సంరక్షణలో ఆసుపత్రిలో చేరారో, ఆ సంస్థ నుండి స్వతంత్ర మానసిక ఆరోగ్య న్యాయవాదులు పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరిస్తారు. స్వతంత్ర మానసిక ఆరోగ్య న్యాయవాదులు మీ నిర్బంధంపై అప్పీల్ చేయడంలో మీకు మద్దతు ఇవ్వగలరు మరియు మీ వార్డ్ సమీక్షలకు హాజరు కాగలరు. మీకు చికిత్స చేస్తున్న వ్యక్తులు మీ అభిప్రాయాలు, ఆలోచనలను వినేలా మరియు పరిగణనలోకి తీసుకునేలా వారు సహాయం చేయగలరు.
స్వతంత్ర మానసిక ఆరోగ్య న్యాయవాదుల గురించి మరింత సమాచారాన్ని మీరు Mind వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
కమ్యూనిటి మానసిక ఆరోగ్య సేవలు
మీరు మీ సంరక్షణ మరియు చికిత్సను కమ్యూనిటిలో పొందగలరు. దీని అర్థం ఏమిటంటే, మీరు మీ ఇంట్లోనే లేదా సహాయక నివాసంలో ఉంటూనే, ఒక కమ్యూనిటీ మానసిక ఆరోగ్య బృందం ద్వారా చికిత్స పొందవచ్చు.
కమ్యూనిటీ మానసిక ఆరోగ్య బృందాలలో మానసిక వైద్యులు, మానసిక ఆరోగ్య నర్సులు, వృత్తిపరమైన చికిత్సకులు, మనస్తత్వశాస్త్రవేత్తలు, సహాయక కార్యకర్తలు ఇంకా అనేక మంది ఉంటారు.
మీ మందులను సమీక్షించడం ద్వారా లేదా మానసిక చికిత్సలను అందించడం ద్వారా మీకు మానసిక ఆరోగ్య మద్దతు ఇవ్వడంతో పాటు, వారు ఉపాధి, గృహవసతి లేదా ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి ఇతర విషయాలలో కూడా మీకు సహాయం చేయగలరు.
సహాయక వసతి
మీకు సహాయక వసతి అవసరమైతే, దాన్ని పొందే ప్రక్రియ సంక్లిష్టంగా ఉండవచ్చు. దీనిని పొందడం అనేది, మీ సంరక్షణలో పాలుపంచుకునే వ్యక్తులందరి మధ్య సహకారంపై ఆధారపడి ఉంటుంది. సమాజంలో మీరు సంరక్షణ పొందేటప్పుడు, మీకు సరైన మద్దతు లభించేలా చూస్తూనే, మీ స్వయంప్రతిపత్తిని పెంపొందించడంపై ప్రధాన దృష్టి ఉండాలి.
కమ్యూనిటిలోని బృందాలు
కమ్యూనిటిలో మీకు మద్దతు ఇవ్వగల వివిధ బృందాలు ఉన్నాయి:
సైకోసిస్‌లో ప్రారంభ జోక్య బృందం
ఈ బృందం, మానసిక రుగ్మతలో తొలిదశకు చేరుకున్న వ్యక్తులకు విస్తృతమైన సహాయాన్ని అందిస్తుంది; వీరిలో కొందరికి స్కిజోఫ్రీనియా లేదా స్కిజోఅఫెక్టివ్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ కావచ్చు.
దృఢమైన ప్రచార బృందం
దీర్ఘకాలం నుండి స్కిజోఫ్రెనియా లేదా స్కిజోఅఫెక్టివ్ డిజార్డర్ ఉన్నట్లుగా నిర్ధారణ అయిన వారికి, ఈ బృందం విస్తృతమైన సహాయాన్ని మరియు మద్దతును అందిస్తుంది. ఇతర సేవలతో వ్యవహరించడం కష్టంగా భావించేవారికి, లేదా వివిధ కారణాల వల్ల తమ మందులను క్రమం తప్పకుండా తీసుకోలేకపోయినవారికి ఈ బృందం ప్రత్యేకంగా సహాయకరంగా ఉంటుంది.
సంక్షోభ పరిష్కార మరియు గృహ చికిత్స బృందం
మీరు మానసికంగా అనారోగ్యం పాలవుతున్నట్లయితే, ఆసుపత్రిలో చేరడానికి ప్రత్యామ్నాయంగా ఈ బృందం మీకు సహాయపడగలదు.
వృత్తిపరమైన పునరావాసం
ఇందులో పగటి కేంద్రాలు, పగటి ఆసుపత్రులు మరియు కమ్యూనిటి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు ఉద్యోగ పునఃప్రవేశ కోర్సులు, విద్య, కళలు మరియు వంట వంటి వివిధ కార్యకలాపాలను అందిస్తాయి. మీరు ఎదుర్కొంటున్నటువంటి విషయాలనే అనుభవిస్తున్న ఇతర వ్యక్తులతో కూడా మీరు పరిచయాలు ఏర్పరచుకోగలిగే అవకాశం ఉంది.
మీరు నివసించే ప్రదేశాన్ని బట్టి, ఈ సేవల అందుబాటులో వ్యత్యాసాలు ఉండవచ్చు.
సామాజిక మద్దతు
మీరు సమాజంలో మీ పనులు మీరే చూసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, మీకు ఒక సామాజిక కార్యకర్తను కేటాయించడం సహాయకరంగా ఉంటుంది. వారు, మీకు ఏవైనా తీరని సామాజిక సంరక్షణ అవసరాలు ఉన్నాయో లేదో అర్థం చేసుకోవడానికి సంరక్షణ చట్టం మదింపును చేపడతారు.
సంరక్షణ చట్టం మదింపు ప్రకారం, మీకు ఈ క్రింది వాటిని అందించాలని సిఫార్సు చేయవచ్చు:
- మీ స్వంత నివాసంలో, సమాజం మధ్య అందించే సంరక్షణ ప్యాకేజీ
- సహాయ సహకారాలతో కూడిన నివాస ఏర్పాటు
- వృత్తిరీత్యా చికిత్స నిపుణుడి నుండి అంచనా
మిమ్మల్ని మానసిక వైద్య ఆసుపత్రిలో చేర్చినప్పుడు లేదా మీరు సమాజంలో ఉన్నప్పుడు సంరక్షణ చట్టం మదింపు జరగవచ్చు.
నేను ఎప్పటికి కోలుకోవచ్చని ఆశించవచ్చు?
కోలుకోవడం అనేది అనేకమంది వ్యక్తులకు అనేక రకాలుగా ఉంటుంది. ఇది మీరు సూచించిన మందులను ఎంత క్రమం తప్పకుండా తీసుకుంటారు, మానసిక ఆరోగ్య సేవలతో మీరు ఎంత చురుకుగా మమేకమవుతారు, అలాగే స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి మీరు పొందే మద్దతు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీరు కోలుకోవడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి అన్ని 'సరైన' పనులూ చేసినప్పటికీ, మీ రుగ్మత లక్షణాలలో హెచ్చుతగ్గులను ఎదుర్కోవచ్చు.
కోలుకోవడాన్ని కేవలం ‘లక్షణాలు పూర్తిగా మాయమైపోవడం’గా భావించకుండా ఉండటం సహాయకరంగా ఉంటుంది; ఎందుకంటే, అలా జరగడం సాధ్యం కాకపోవచ్చు. దానికి బదులుగా, మీరు కోలుకోవడాన్ని ఇలా భావించవచ్చు:
- మీరు మునుపటిలా పనులు చేయగలగడం
- మీ పరిస్థితిని అర్థం చేసుకోవడం
- మీరు సాధ్యమైనంత ఉత్తమంగా ఉండేందుకు ఏది సహాయపడుతుందో తెలుసుకోవడం
- మీరు అనారోగ్యం పాలవుతున్నప్పుడు కనిపించే సంకేతాలను గుర్తించడం, మరియు ఆ సమయంలో మీకు ఎటువంటి సహాయం అవసరమో తెలుసుకోవడం.
నాకు నేను ఎలా సహాయం చేసుకోగలను?
మీరు సాధ్యమైనంత ఆరోగ్యంగా ఉండేందుకు, మీకు మీరే సహకరించుకోవడానికి మీరు చేయగలిగిన విషయాలు చాలా ఉన్నాయి. మీ మానసిక ఆరోగ్య బృందం మీకు ఆరోగ్యంగా ఉండేందుకు ఒక ప్రణాళికను అందించి దానిని పూర్తి చేయడానికి మీతో కలిసి పనిచేయాలి. మీ ఆరోగ్య సంరక్షణ ప్రణాళికను క్రమం తప్పకుండా సమీక్షించాలి మరియు అవసరమైతే సవరించాలి. ఈ ప్రణాళిక మీతోనూ, మీ సంరక్షణలో పాలుపంచుకునే వారితోనూ కలిసి రూపొందించబడటం, అలాగే ఇందులో పొందుపరిచిన అంశాలు మీకు తగినవిగా ఉండటం అత్యంత ముఖ్యం.
మీకు మీరుగా మద్దతునిచ్చుకోవడానికి మీరు చేయగలిగే ఇతర ముఖ్యమైన విషయాలు:
మీకు ఒత్తిడి కలిగించే విషయాలకు దూరంగా ఉండటం
ఈ విషయాలు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి, కానీ వీటిలో ఇవి ఉండవచ్చు:
- ఒత్తిడిని ప్రేరేపించే పరిసరాలు – ఇవి మీకు తీవ్రమైన ఒత్తిడిని కలిగించే నిర్దిష్ట ప్రదేశాలు లేదా వ్యక్తులు కావచ్చు.
- మత్తు పదార్థాలు మరియు మద్యం – మద్యం సేవించడం లేదా మత్తు పదార్థాలను తీసుకోవడం ఆ సమయంలో ఆనందదాయకంగా అనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో అది మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. మత్తు పదార్థాలు మరియు మద్యం మీ మానసిక స్థితిని క్షీణింపజేసి, మీరు అనుమానంతో కూడిన భయాలకు లోనయ్యేలా లేదా భ్రమలకు గురయ్యేలా చేయగలవు. మందులు మరియు మద్యం మీ ఔషధాలతో చర్య జరిగి వికటించి, అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
మీ శ్రేయస్సుకు తోడ్పడే పనులు చేయడం
వీటిలో చాలా విషయాలు, మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి ఎవరైనా చేయగలిగినవే. మీకు మానసిక అనారోగ్యం ఉంటే, అవి ప్రత్యేకంగా సహాయపడగలవు:
- మంచి ఆహారం – క్రమం తప్పకుండా తినడానికి ప్రయత్నించండి, భోజన సమయాలను వదిలివేయకండి, మరియు మంచి ఆహారాన్ని తినండి. మంచి ఆహారం గురించి మరింత సమాచారాన్ని మీరు NHS వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
- వ్యాయామం – చురుకుగా ఉండటం మంచి మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుందని నిరూపించబడింది. మీరు ఆస్వాదించే, క్రమం తప్పకుండా చేయగలిగే ఒక వ్యాయామాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. దీని అర్థం వేగంగా నడవడం, ఈత కొట్టడం, లేదా స్థానిక వ్యాయామ తరగతిని ప్రయత్నించడం కావచ్చు.
- మీ మానసిక ఆరోగ్య బృందంతో సంప్రదింపులు కొనసాగించడం – ఒకవేళ మీరు ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే, మీ మానసిక ఆరోగ్య బృందాన్ని సంప్రదించండి; మీకు సహాయం అవసరమైన అంశాలలో వారు ఎటువంటి మద్దతును అందించగలరో తెలుసుకోండి.
- ఆర్థిక మరియు గృహ నివాస స్థిరత్వం - ఆర్థిక మరియు గృహ నివాస స్థిరత్వం లేకపోవడం వల్ల కలిగే సమస్యలు వ్యక్తికి తీవ్రమైన ఒత్తిడిని కలిగించవచ్చు. మీరు మీ గృహ లేదా ఆర్థిక విషయాలలో ఇబ్బంది పడుతుంటే, ప్రయోజనాలు, ఆర్థిక సహాయం మరియు రుణ సలహాపై మా వనరును చూడండి. ఇది మీరు ఏ రకమైన ప్రయోజనాలకు అర్హులు కావచ్చు మరియు వాటిని ఎలా పొందాలో వివరిస్తుంది. మీ మానసిక ఆరోగ్య బృందంలో ఒక ఆక్సుపేషనల్ చికిత్సకుడు ఉంటే, వారు కూడా ఇందులో మీకు సహాయం చేయగలరు.
మీ మళ్లీ సమస్యలు రావడానికి సంబంధించిన సంకేతాలను (పునఃస్థితి) అర్థం చేసుకోవడం
మీ పునఃస్థితి సంకేతం అనేది, మీరు మానసికంగా అనారోగ్యానికి గురవుతున్నప్పుడు సాధారణంగా చేయడం ప్రారంభించే పనులను లేదా ప్రదర్శించడం మొదలుపెట్టే ప్రవర్తనలను వివరించే ఒక పద్ధతి. ఇది మీకు మాత్రమే ప్రత్యేకమైనది కాబట్టి దీనిని 'ప్రత్యేక లక్షణం' అని పిలుస్తారు.
మీరు మరియు మీకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఈ విషయాలను గమనిస్తూ ఉండవచ్చు. మీరు ఈ విధమైన ప్రవర్తనలు ప్రారంభిస్తే ఏమి చేయాలో ముందుగానే ఒక అంగీకరించిన ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు. మీరు అస్వస్థతకు లోనవుతున్న సంకేతాలలో ఇవి కొన్ని కావచ్చు:
- నిద్రపోకపోవడం
- ఒంటరిగా ఉండటం లేదా మామూలు కంటే ఎక్కువగా బయటకు వెళ్లడం
- మీరు సాధారణంగా మాట్లాడే లేదా ప్రవర్తించే విధానానికి భిన్నంగా మాట్లాడటం లేదా ప్రవర్తించడం
- మీ పని లేదా చదువు పనితీరులో తగ్గుదల
- కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల పట్ల కూడా ఎక్కువగా చిరాకు లేదా దూకుడు ప్రవర్తన చూపడం
తిరిగి అనారోగ్యం బారిన పడటం విషయంలో పరిగణించవలసిన ఒక ముఖ్యమైన విషయం ‘అవగాహన కోల్పోవడం’. మీరు అనారోగ్యంగా ఉన్నారని, మరియు మీ లక్షణాలు నిజమైనవి కావని మీరు గుర్తించలేకపోవడాన్ని ఇది సూచిస్తుంది.
రికవరీ కళాశాలలు
రికవరీ కళాశాలలు మానసిక అనారోగ్యం, మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై ఆన్‌లైన్ మరియు ప్రత్యక్ష కోర్సులను అందిస్తాయి. మానసిక అనారోగ్యంతో బాధపడుతూ, తమ పరిస్థితి గురించి మరింత తెలుసుకోవాలని, అలాగే తమ కోలుకోవడానికి ఎలా సహాయపడగలరో ఆసక్తి ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని ఇవి రూపొందించబడ్డాయి. రికవరీ కళాశాలలు కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సంరక్షకులను లక్ష్యంగా చేసుకున్న కోర్సులు కూడా ఉంటాయి.
రికవరీ కళాశాలలు అనేక NHS మానసిక ఆరోగ్య ట్రస్టుల్లో అందుబాటులో ఉన్నాయి, అలాగే Recovery College Onlineద్వారా కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
సామాజిక పత్రం
మీరు కోలుకునే ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగం, మీకు ఆనందాన్నిచ్చే పనులను ఇతరులతో కలిసి చేస్తూ సమయం గడపడం కావచ్చు. సామాజిక సూచన అనేది ప్రజలను వారి స్థానిక సామాజిక సేవలు మరియు సమూహాలతో అనుసంధానించడానికి సహాయపడుతుంది, ఇవి వారి మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి మద్దతు ఇవ్వగలవు.
ఉదాహరణకు, మీరు తోటపని (గార్డెనింగ్)ను ఇష్టపడితే, సామాజిక సూచనలో భాగంగా మీ సమీపంలోని వారాంతపు తోటపని బృందంతో మిమ్మల్ని అనుసంధానించవచ్చు. అక్కడ మీరు ఇతరులను కలుసుకుని, మీకు నచ్చిన పని చేస్తూ కలిసి సమయం గడపవచ్చు.
దీని గురించి మీరు మా సామాజిక సూచన వనరులో మరింత తెలుసుకోవచ్చు.
పనిచేయడం
మీరు చాలా అనారోగ్యంగా ఉన్నట్లయితే, మీ వృత్తి జీవితంలో మార్పులు చేసుకోవలసి రావచ్చు. దీని అర్థం, మీ యజమాని/కార్యాలయం నుండి మరింత మద్దతు పొందడం, మీ ఉద్యోగం నుండి విరామం తీసుకోవడం, లేదా మీ ప్రస్తుత ఉద్యోగం మీకు ఒత్తిడిని కలిగిస్తే వేరే ఉద్యోగాన్ని వెతకడం కావచ్చు. మార్పులు శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ మీరు సాధ్యమైనంత ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడే ఏవైనా మార్పులు ఉన్నాయేమో అని ఆలోచించడం ముఖ్యం.
మీ యజమానికి/కార్యాలయం యాజమాన్యనికి సమాచారం ఇవ్వడం
మీకు మానసిక అనారోగ్యం ఉన్నట్లు నిర్ధారణ అయితే, ఆ విషయాన్ని మీ యజమానికి చెప్పాలా లేదా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. తమ వ్యాధి నిర్ధారణ గురించి తమ యజమానులతో మాట్లాడితే ఉద్యోగాన్ని కోల్పోతామేమోనని, తమ పట్ల దుర్వ్యవహారం జరుగుతుందేమోనని, లేదా తమ సహోద్యోగుల కంటే భిన్నంగా చూడబడతారేమోనని కొంతమంది ఆందోళన చెందుతారు.
ఉత్తర ఐర్లాండ్‌లోని సమానత్వ చట్టం 2010 మరియు వైకల్య వివక్ష చట్టం 1995 ప్రకారం మానసిక అనారోగ్యాలు వైకల్యంగా పరిగణించబడతాయి. దీని అర్థం, ఒక వ్యక్తికి మానసిక అనారోగ్యం ఉందని కారణంగా అతనిపై వివక్ష చూపించడం చట్టానికి విరుద్ధం.
మీరు మీ నిర్ధారణ గురించి మీ యజమానికి తెలియజేస్తే, వారు మీకు మద్దతు ఇవ్వాల్సిన చట్టబద్ధమైన బాధ్యత కలిగి ఉంటారు.
సమంజసమైన/సహేతుకమైన మార్పులు
మీ ఉద్యోగంలో సహేతుకమైన సర్దుబాట్లు చేసుకోవడానికి మీ యజమాని మీకు సహాయం చేయాల్సి రావచ్చు. ఉదాహరణకు, మీరు అనారోగ్యంతో ఉన్నప్పటికీ తిరిగి పనికి వెళ్లడానికి సిద్ధంగా ఉంటే, వారు మీకు దశలవారీగా తిరిగి చేరే అవకాశాన్ని ఇవ్వవచ్చు. దీని అర్థం పూర్తి రోజులకు బదులుగా సగం రోజులు పని చేయడం లేదా పరిమిత గంటలు పని చేసి, ఆపై నెమ్మదిగా మీ పని గంటలను పెంచుకుంటూ మళ్లీ పూర్తి సమయానికి చేరుకోవడం కావచ్చు.
మీకు ఏ విధమైన సర్దుబాట్లు సహాయకరంగా ఉంటాయో ఆలోచించి, వాటి గురించి మీ యజమానితో మాట్లాడండి. సహేతుకమైన సర్దుబాట్లు గురించి మరింత తెలుసుకోవడానికి మీరు Acas వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Access to Work
Access to Work అనేది డిపార్ట్‌మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్ (DWP) ద్వారా అందించబడే ఒక సేవ, ఇది వైకల్యాలున్న వ్యక్తులకు ఆచరణాత్మక మరియు ఆర్థిక సహాయాన్ని అందించగలదు. ఇది ఉద్యోగంలో ఉన్నవారికి, స్వయం ఉపాధి పొందుతున్నవారికి లేదా ఉద్యోగం కోసం చూస్తున్నవారికి అందుబాటులో ఉంది.
పైన వివరించిన ‘సహేతుకమైన సర్దుబాట్లు’కు మించి Access to Work మద్దతు లేదా సర్దుబాట్లను అందించగలదు. ఉదాహరణకు, Access to Work మీ యజమానికి మీ కోసం జాబ్ కోచ్ లేదా అదనపు శిక్షణకు ఖర్చు చెల్లించడానికి సహాయం చేయవచ్చు.
వాహనం నడపడం
మీరు సైకోసిస్‌ను అనుభవిస్తూ వాహనం నడుపుతున్నట్లయితే, మీరు Driver and Vehicle Licensing Agency (DVLA)కి తెలియజేయడం చట్టపరంగా అవసరం.
మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు వాహనం నడపడం ఆపాలి, ఎందుకంటే అది మీకు సురక్షితం కాదు. అయితే, మీరు కనీసం 3 నెలల పాటు ఆరోగ్యంగా ఉన్నట్లయితే, మళ్లీ డ్రైవింగ్ ప్రారంభించవచ్చు. మీరు వాహనం నడపడం సురక్షితమా కాదా అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో మీ వైద్యుడు మీకు సహాయం చేయగలరు.
మీరు కోలుకున్న తర్వాత, మళ్లీ వాహనం నడపడం సురక్షితమేనా అని అంచనా వేయమని కోరుతూ DVLA మీ సాధారణ వైద్యునికి లేదా మానసిక వైద్యునికి లేఖ రాస్తుంది.
మానసిక అనారోగ్యాలు మరియు డ్రైవింగ్ గురించి మరింత సమాచారం కోసం, మీరు DVLA వెబ్‌సైట్‌లోని మానసిక రుగ్మతల విభాగాన్ని చూడవచ్చు.
కుటుంబం మరియు స్నేహితుల కోసం సమాచారం
సైకోసిస్‌కు గురైన వారు మీకు ఎవరైనా తెలిసి ఉంటే, వారికి ఎలా మద్దతు ఇవ్వాలో మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇక్కడ, మీరు చేయగలిగే కొన్ని విషయాలను మేము సూచించాము.
మీకు మీరు మద్దతు ఇచ్చుకోవడం
సైకోసిస్ అనేది, వ్యాధి నిర్ధారణ పొందిన వ్యక్తికి తెలిసిన వారిని కూడా ప్రభావితం చేయవచ్చు. మీకు తెలిసిన లేదా మీరు శ్రద్ధ వహించే వ్యక్తి సైకోసిస్‌తో బాధపడుతుంటే, మీరు కూడా సమాచారం మరియు మద్దతు పొందడం సహాయకరంగా ఉంటుందని భావించవచ్చు. ఇది మీ ఇద్దరికీ సహాయకరంగా ఉంటుంది, ఎందుకంటే మీకు ఎంత ఎక్కువ సమాచారం మరియు మద్దతు ఉంటే, మీకు తెలిసిన వ్యక్తికి అంత ఎక్కువగా సహాయం చేయగలుగుతారు.
సైకోసిస్ గురించి అవగాహన పొందడం
సైకోసిస్ అనేది తరచుగా తప్పుగా అర్థం చేసుకోబడే ఒక పరిస్థితి. ఆరోగ్య సంరక్షణ సంస్థలు లేదా స్వచ్ఛంద సంస్థల నుండి విశ్వసనీయమైన సమాచారాన్ని ఉపయోగించి, మీకు వీలైన సమయంలో సైకోసిస్ గురించి మరింత తెలుసుకోవడం ద్వారా మీరు తెలిసిన వ్యక్తికి సహాయం చేయవచ్చు. అటువంటి కొన్ని సంస్థలను మేము క్రింద జాబితా చేసాము. మీరు మరియు మీ ప్రియమైన వారు ఇప్పుడు మరియు భవిష్యత్తులో ఏమి ఆశించవచ్చో అర్థం చేసుకోవడానికి,సైకోసిస్‌ను అనుభవించిన వ్యక్తుల అనుభవాలను కూడా మీరు వెతకవచ్చు.
మీరు ఎలా సహాయం చేయవచ్చో తెలుసుకోవడం
మీకు తెలిసిన వ్యక్తికి మీరు ఏవైనా ప్రత్యేక విషయాలలో సహాయం చేయగలరేమో అని అడగండి. వారు తమ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకోవడంలో సహాయం చేయడం వంటి ఆచరణాత్మక సహాయం కోసం మిమ్మల్ని అడగవచ్చు. లేదా వారు మీతో పాటు ఒక అపాయింట్‌మెంట్‌కు హాజరవడం వంటి మానసిక మద్దతును కోరవచ్చు.
మీరు ఎవరి సంరక్షణలోనైనా దగ్గరగా పాలుపంచుకుంటున్నట్లయితే, వారి చికిత్స గురించి వైద్యులతో మాట్లాడటం, నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడటం లేదా సలహా ఇవ్వడం వంటివి చేయవలసిన సందర్భాలు కూడా ఉండవచ్చు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సంరక్షించడం పై మా వనరులో మీరు దీని గురించి మరింత తెలుసుకోవచ్చు.
ఆర్థిక సహాయం
మీకు తెలిసిన వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు అధికంగా డబ్బు ఖర్చు చేసే ప్రమాదానికి గురికావచ్చు, లేదా ఇతరులచే ఆర్థికంగా దోపిడీకి గురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పరిస్థితి ఇలా ఉంటే, వారి డబ్బును కాపాడుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవడంలో మీరు వారికి సహాయపడగలరు. ఇది మీరిద్దరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం.
మీరు ప్రయోజనాలు, ఆర్థిక సలహా మరియు రుణం గురించి మరింత సమాచారాన్ని మా సమాచార వనరులో తెలుసుకోవచ్చు. మానసిక అనారోగ్యంతో బాధపడే వ్యక్తుల కోసం డబ్బు, అప్పు మరియు ఆర్థిక సహాయం గురించి మరింత చదవడానికి మీరు National Debtline వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు.
మీరు Citizen’s Advice సైట్‌ను కూడా సందర్శించవచ్చు లేదా మీ స్థానిక Citizen’s Advice .కేంద్రాన్నిసందర్శించవచ్చు. మీకు అర్హత ఉన్న ప్రయోజనాల గురించి మీరు ఒక సలహాదారుతో మాట్లాడగలగాలి, మరియు ఫారమ్‌లను పూరించడంలోనూ, సహాయక సాక్ష్యాలను పొందడంలోనూ వారు మీకు మద్దతు ఇవ్వగలరు.
భ్రమలను అర్థం చేసుకోవడం
తమకు తెలిసిన వారు స్పష్టంగా అసత్యమైన ఆలోచనలు లేదా అభిప్రాయాలను కలిగి ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ఎలా స్పందించాలో తెలియడం కష్టంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు తరచుగా ఈ ఆలోచనలను సవాలు చేయాలా, వాటితో ఏకీభవించాలా, లేక వాటిని విస్మరించాలా అని ఆలోచిస్తుంటారు. మానసిక రుగ్మత లక్షణాలను అనుభవిస్తున్న వ్యక్తికి, ఆ లక్షణాలకు మరియు వాస్తవానికి మధ్య తేడాను గుర్తించడం అసాధ్యం కావచ్చని గుర్తుంచుకోవడం ముఖ్యం.
వారి భావాలకు కారణమవుతున్న నమ్మకాలను అంగీకరించడం కంటే, వారి భావాలను అంగీకరించడమే మీకు మరింత సహాయకరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, మీకు తెలిసిన వ్యక్తి ప్రభుత్వం తమపై నిఘా పెట్టిందని భయపడుతుంటే, అలా జరగడం లేదని వారిని ఒప్పించడానికి ప్రయత్నించే బదులు, మీరు వారి భావాలకు అనుగుణంగా ఇలా చెప్పవచ్చు:
అది వినడానికి చాలా భయంకరంగా ఉంది, మీకు ఇలాంటి అనుభవం రావడం బాధగా ఉంది. మీకు మరింత సురక్షితంగా అనిపించేలా నేను ఏమైనా సహాయం చేయగలనా”
దురదృష్టవశాత్తు, ఎవరైనా సంక్షోభంలో ఉన్నప్పుడు వారికి ఉపశమనం కలిగించడం మీకు ఎల్లప్పుడూ సాధ్యం కాకపోవచ్చు.
మీరు సంరక్షకులు అయితే
మీరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని చూసుకోవడానికి సమయం కేటాయిస్తే, మిమ్మల్ని 'సంరక్షకుడు'గా పరిగణించవచ్చు. సైకోసిస్ వంటి తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని చూసుకోవడం కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది, మరియు మీరు మీ స్వంత శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలగడం ముఖ్యం. మీరు మిమ్మల్ని మీరు సంరక్షకుడిగా భావించకపోయినప్పటికీ, మీరు కొన్ని ప్రయోజనాలు మరియు మద్దతుకు అర్హులు కావచ్చు.
మీరు సంరక్షకులు అయితే, మీరు ఉచిత సంరక్షకుల మదింపుకు అర్హులు. మీ జీవితాన్ని ఏది సులభతరం చేస్తుందో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. NHS వెబ్‌సైట్‌లో దాన్ని ఎలా పొందాలో మీరు మరింత తెలుసుకోవచ్చు.
సైకోసిస్ తో బాధపడే వ్యక్తుల సంరక్షకులు, ఇతర స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థానిక సహాయక బృందాలను కూడా మీరు కనుగొనగలిగే అవకాశం ఉంది.
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సంరక్షించడంపై మా సమాచారంలో దీని గురించి మరింత తెలుసుకోండి.
మరిన్ని వనరులు
పెద్దలలో సైకోసిస్ మరియు స్కిజోఫ్రీనియా: నివారణ మరియు నిర్వహణ, ప్రజల కోసం సమాచారం, NICE –National Institute for Health and Care Excellence (NICE) వివిధ ఆరోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు పొందవలసిన సంరక్షణ మరియు చికిత్స ప్రమాణాలపై మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఈ సమాచారం ప్రజల కోసం ఉద్దేశించబడింది మరియు సైకోసిస్, స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్న వయోజనుల కోసం మార్గదర్శకాలను వివరిస్తుంది.
స్వచ్ఛంద సంస్థలు
సైకోసిస్ మరియు ఇతర మానసిక ఆరోగ్య సమస్యల గురించి ఇతర విశ్వసనీయ సమాచారాన్ని మీరు ఈ క్రింది స్వచ్ఛంద సంస్థల ద్వారా పొందవచ్చు:
సంబంధిత వనరులు
సైకోసిస్ మరియు దాని సహాయం, చికిత్సకు సంబంధించిన మా వనరులలో కొన్ని కింద ఇవ్వబడ్డాయి, ఇవి మీకు సహాయకరంగా ఉండవచ్చు:
ఇతర పరిస్థితులు
చికిత్స విధానాలు
మద్దతు మరియు సంరక్షణ
కృతజ్ఞతలు
ఈ సమాచారాన్ని రాయల్ కాలేజీ ఆఫ్ సైకియాట్రిస్ట్ (Royal College of Psychiatrists) Public Engagement Editorial Board (PEEB) రూపొందించింది. ఇది వ్రాసే సమయంలో అందుబాటులో ఉన్న ఉత్తమ సాక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.
నిపుణులైన రచయితలు: డాక్టర్. డెక్లాన్ హైలాండ్, డాక్టర్. ఏంజెలికి టిజియాకా, డాక్టర్. జాన్ క్రాస్బీ మరియు డాక్టర్. లూయే ఎల్‌టాగి
అనుభవజ్ఞులైన నిపుణులు: ఆలిస్ ఇవాన్స్, యాష్లీ సింబి, డెబ్రా నైచాలా, జానెట్ సీల్, మార్క్ ఎల్లెర్బీ, మైఖేల్ రాబిన్సన్ మరియు డాక్టర్ సోఫియా ఒపాసిక్.
పూర్తి సూచనలు అభ్యర్థనపై అందించబడతాయి.